'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ పెళ్లెలా జరిగిందో తెలుసా?
on Oct 24, 2021
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' సూపర్ హిట్ కావడంతో చాలా కాలం తర్వాత సక్సెస్ రుచిని ఎంజాయ్ చేస్తున్నాడు డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్. అఖిల్, పూజా హెగ్డే జంటగా అతను రూపొందించిన ఈ మూవీ ఇంటా, బయటా విజయ దుందుభి మోగిస్తోంది. నాలుగు సినిమాలు చేసిన అఖిల్‌కు ఫస్ట్ హిట్‌ను అందించిన డైరెక్టర్‌గా కూడా భాస్కర్ పేరు సంపాదించుకున్నాడు. మ్యారీడ్ లైఫ్ నుంచి ఏం ఆశిస్తున్నారు? అనే పాయింట్ చుట్టూ అల్లుకున్న కథను అతను తెరకెక్కించిన తీరు యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌నూ అమితంగా ఆకట్టుకుంటోందని కలెక్షన్లు నిరూపిస్తున్నాయి.
స్వతహాగా తమిళుడైన భాస్కర్ ఒక తెలుగు అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడనే విషయం కొంతమందికే తెలుసు. డైరెక్ట్ చేసిన ఫస్ట్ ఫిల్మ్ 'బొమ్మరిల్లు' బ్లాక్‌బస్టర్ కావడంతో భాస్కర్ పేరు మారుమోగిపోయింది. బొమ్మరిల్లు అనేది అతని ఇంటిపేరుగా మారిపోయింది. రెండో సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నప్పుడు ఇంట్లోవాళ్లు అతనికి పెళ్లి సంబంధాలు చూడ్డం మొదలుపెట్టారు. అప్పటికే అతను ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. సరైన సమయం చూసి నాన్నకు చెప్పాలని అనుకుంటున్నాడు. ఓసారి వాళ్లనాన్న భాస్కర్ జాతకం పట్టుకొని కూర్చున్నారు. ఏంటని అడిగితే, "నీకు ఈ వారం పది రోజుల్లో పెళ్లికాకపోతే, జాతకం ప్రకారం చాలా ఆలస్యమైపోతుంది" అని చెప్పారు.
అయితే అయింది, తొందరేముంది అన్నాడు భాస్కర్. ఆ మరుసటి రోజే ఓ అమ్మాయితో అతనికి పెళ్లి ఫిక్స్ చేసేశారు. "ఓ వారంలో నీకు పెళ్లి" అని కూడా చెప్పారు. దాంతో భాస్కర్ ఆందోళనలో పడ్డాడు. తన లవ్ మేటర్ ఇంట్లో చెప్పకుండా తప్పు చేశాననుకున్నాడు. వెంటనే వాళ్ల నాన్నకు ఫోన్ చేశాడు. "నాన్నా.. ఈ విషయం నీకు ఇదివరకే చెబుదామనుకున్నా, తొందరేముందని ఆగాను. నేనొక అమ్మాయిని ప్రేమించాను. అరసవెల్లిలో పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నా. మీరంతా బయలుదేరి వచ్చేయండి" అని చెప్పాడు. దాంతో వాళ్ల నాన్న షాకైపోయాడు. ఇంట్లో వాళ్లకు ఆయన ఈ విషయం చెప్పగానే వాళ్లంతా షాకు.
భాస్కర్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా సరైనదే తీసుకుంటాడనేది వాళ్ల నాన్న నమ్మకం దాంతో ఆయన తన కుటుంబాన్నంతా తీసుకొని అరసవెల్లికి వచ్చేశారు. అలా భాస్కర్ వివాహం అరసవెల్లిలో జరిగింది. అతని భార్య పేరు గౌరి శ్రీవిద్య. విజయనగరం అమ్మాయి. ఫ్యామిలీ ఫ్రెండ్స్ ద్వారా భాస్కర్, గౌరి ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆ పరిచయం కొద్ది రోజులకు స్నేహంగా, మరికొద్ది రోజులకు ప్రేమగా మారింది. పెళ్లి చేసుకున్నారు.
వాళ్లమ్మాయి పేరు హాసిని. 'బొమ్మరిల్లు'లో తన కథానాయిక పేరునే కూతురికి పెట్టుకున్నాడు భాస్కర్. మ్యారీడ్ లైఫ్ అంటే ఏమిటో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'లో అతను చూపించిన దానికీ, అతని మ్యారీడ్ లైఫ్‌కూ కనెక్షన్ ఉందనడంలో సందేహమే లేదు.
Also Read